గమనిక:

మేము బహుమతికి ఎంపిక చేసిన “పిపాస” నాటిక ఇంతకు ముందు ప్రదర్శించారన్న విషయం నాటికల పోటీ ఫలితాలు ప్రకటించిన తరువాత మా దృష్టికి తీసుకురాబడింది . మా నిబంధనల్లో “పోటీకి పంపిన రచనలు ఇంతకు ముందు ప్రచురించకూడనివి” అయి ఉండాలి అని చెప్పాము. నాటికలకి ప్రదర్శనే ప్రచురించడం అని మా ఉద్దేశం. కానీ, రచయితలు ఆ నిబంధనని వేరే విధంగా అర్థం చేసుకున్నారు. మా నిబంధనల్లో అస్పష్టతకి విచారిస్తున్నాము. కానీ, ప్రకటించిన బహుమతిని వెనక్కి తీసుకుని రచయితని అగౌరవపరచడం మా అభిమతం కాదు. అందువల్ల మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. ఇక ముందు నిబంధనల్లో అస్పష్టత లేకుండా చూస్తాము.

జరిగిన పొరపాటుకు విచారిస్తూ, ప్రదర్శన కారణంగా పరిశీలించకుండా ఉన్న నాటికలని పునఃపరిశీలించి, అర్హమైన వాటికి తగిన విధంగా గుర్తింపు కలిగిస్తాము. ఈ విషయం యింతటితో ముగిస్తున్నాము.

తెల్సా బృందం

తెల్సా నాటికల పోటీకి మాకు దాదాపు 56 నాటికలు వచ్చాయి. స్కాను చేసి పంపినవి, మరొక రచనకు నాటకానుసరణలు, ఇప్పటికే ప్రదర్శించబడినవి వంటివి మినహాయిస్తే మేము పోటీకి పరిశీలించిన నాటికలు 49. మాకు అందిన నాటికల ప్రమాణం బహుమతి పొందిన కథల ప్రమాణంతో పోలిస్తే చాలా నిరుత్సాహపరిచిందని చెప్పక తప్పదు. కాలదోషం చెందిన ఇతివృత్తమో, ప్రదర్శనయోగ్యత కొరవడడమో, భాషలో నియతి లోపించడమో, తొందరపాటుగా రచన పూర్తిచేసి పంపించడమో, పదికాలాల పాటు నిలవడవలసిన బహుమతి రచనకు వలసిన మేధోమథనం జరగకపోవడమో వంటి ఏదో ఒక విధమైన కొరత యిబ్బంది పెట్టింది. అందువలన మంచిరచన కాగలినవి కూడా బహుమతికిగాని, సాధారణ ప్రచురణకుగాని నోచుకోకపోవడం జరిగింది. దీనికి కారణం తెలుగునాట నాటకాలు ప్రచురించే పత్రికలు దాదాపు లేకపోవడమో, నాటకప్రదర్శనకు అవకాశం తగ్గడం కారణమో తెలియదు.

ఈ 49 నాటికలను జాగ్రత్తగా చదివి, కాచి వడబోసిన రచనలను ఒకటికి పదిమార్లు చదివి, ఒక నాటికను మొదటి బహుమతికి ఎంచుకుని మరొక రెండు నాటికలను రెండవ బహుమతికై ఆమోదించాము. బహుమతి మొత్తాలను కొద్దిగా తగ్గించినా, మొత్తం రెండు బదులు మూడు బహుమతులు యిస్తున్నాము. మందుగా మేము అనుకున్న మొత్తం కన్నా ఎక్కువగా, మొత్తం ₹70,000 బహుమతులు ఇస్తున్నాము. బహుమతి పొందిన నాటికలు ఇవి:

  • మొదటి బహుమతి ₹30,000
    • పిపాస – మాడభూషి దివాకర బాబు
  • రెండు రెండవ బహుమతులు  ₹20,000 చొప్పున
    • అంజలి – ఆకెళ్ళ
    • విపరీత వ్యక్తులు – పి. చంద్రశేఖర ఆజాద్

ఎంచుకున్న నాటికలను రెండు నెలల తర్వాత మా వెబ్‍సైటు‍లోనూ, మాతో సహకరించే యితర వెబ్‍సైటులో గానీ, ఇతర అమెరికా తెలుగుసంస్థల పత్రికలలోగానీ ప్రచురిస్తాము. మా వెబ్‍సైటు‍లో ప్రచురించిన తర్వాత రచయితలు వారి వీలు ప్రకారం యితరత్రా ప్రచురించుకోవచ్చును. వీలైతే మా సంస్థ, ఇతర స్థానిక సంస్థల కార్యక్రమాలలో ప్రదర్శిస్తాము. పై ముగ్గురు రచయితలకూ మా వ్యాఖ్యలు విడిగా తెలియచేస్తాము. మరొక 2-3 ప్రదర్శనయోగ్యమైన నాటక రచయితలను విడిగా సంప్రదిస్తాము.

పోటీ ముగిసినందువల్ల, ఏ విధమైన ప్రచురణకీ ఆమోదించని నాటికల రచయితలు తమ రచనలని వేరే పత్రికలకి పంపుకోవచ్చు, ప్రదర్శించవచ్చు.

పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ధన్యవాదాలు. పోటీ ప్రకటనని ప్రచురించిన సారంగ వెబ్‍పత్రిక వారికీ, ప్రకటన తయారీకి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన “ఛాయ” మోహన్‌బాబు గారికీ, ప్రకటనని ఫేస్‍బుక్‍లో, ఇతర వాట్స్ఆప్ గ్రూపుల్లో ప్రచురించి, ప్రచారం కల్పించిన మిత్రులందరికీ మా ధన్యవాదాలు. పోటీ ప్రకటనని తమ దినపత్రికలలో ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి దినపత్రికల యాజమాన్యాలకు, సంపాదకులకు కూడా మా ధన్యవాదాలు.

తెల్సా బృందం
మురళి చందూరి, బాపారావు కొచ్చెర్లకోట, పద్మ ఇంద్రగంటి

తెల్సా కథల పోటీ ఫలితాలు
Menu